గిరిజనుల అభివృద్ధికి, పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే గిరిజనులకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వరి భోజనం పరిచయం చేసింది నందమూరి తారక రామారావు అని గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది గిరిజనులు అందరు కూడా ఏదో విధంగా గడిచిన ఐదేళ్లలో ఇబ్బంది పడ్డారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఇచ్చిన లక్ష పాతికవేల ఎకరాలు ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో దళారులతో గిరిజనులకు ఇచ్చిన భూముల్లో వైసీపీ నాయకులు గంజాయిని పండించారన్నారు. గిరిజన పిల్లలను ప్రేరేపించి గంజాయి రవాణాకు వైసీపీ నాయకులు వాడుకున్నారన్నారు. 70 శాతం మంది గిరిజన పిల్లలు జైల్లో మగ్గిపోతున్నారన్నారు. గంజాయి సూత్రధారులు మాత్రం బయటే ఉన్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.