ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలులో వీఐపీ ఖైదీలకు స్పెషల్ ఫుడ్,,,మటన్ మసాలా రూ.8 వేలు, మటన్ కూర రూ.7 వేలు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 10:59 PM

మటన్ మసాలా రూ.8 వేలు, మటన్ కూర రూ.7 వేలు.. ఏంటి.. ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫుడ్ రేట్లు అనుకుంటున్నారా. కాదండీ జైలులో వీఐపీ ఖైదీలకు అందించే ఆహారం రేట్లు. అదేంటీ జైలులో అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారా. సాధారణంగా అయితే అందరికీ ఒకే ఫుడ్ పెడతారు. కానీ కొందరు వీఐపీ ఖైదీలు మాత్రం అడ్డదారిలో జైలు సిబ్బందితో ఇలాంటి వంటకాలు తెప్పించుకుంటారు. తాజాగా ఓ జైలులో జరుగుతున్న అవినీతి ఆరోపణలు బయటికి రావడం తీవ్ర సంచలనంగా మారింది. మహారాష్ట్ర ముంబైలోని తలోజా జైలులో గత కొన్ని రోజులుగా ఈ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులోని ఖైదీలకు అందుతున్న వీఐపీ ఫుడ్ గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


తలోజా జైలులో ఖైదీలకు బయటి నుంచి రకరకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలు అందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఐటెంకు ఒక్కో రేటు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫుడ్ మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సాధారణ ఖైదీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖైదీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు వీఐపీ ఖైదీలకు చికెన్, మటన్ వంటకాలు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు.


 2018 భీమా కోరేగావ్ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేంద్ర గాడ్లింగ్ అనే వ్యక్తి థానేలోని యాంటీ కరెప్షన్ బ్యూరో - ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కొందరు ఖైదీలకు అధిక ధరలకు చికెన్, మటన్ లాంటి వంటకాలు అందిస్తున్నారని సురేంద్ర గాడ్లింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అలర్ట్ అయింది. ఇందులో సదరు ఖైదీల నుంచి జైలు సిబ్బంది లంచం తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ క్రమంలోనే ఆ జైలులో ఒక్కో ఫుడ్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసినట్లు తెలిపారు. అందులో కొన్ని వంటకాల ధరలు


మటన్ మసాలా - రూ.8000


మటన్ కర్రీ - రూ.7000


ష్రింప్ బిర్యానీ - రూ.2000


ఫ్రైడ్ చికెన్ - రూ.2000


హైదరాబాదీ చికెన్ - రూ.1500


చికెన్ మంచూరియా - రూ.1500


చికెన్ మసాలా - రూ.1000


వెజ్ మంచూరియా - రూ.1000


వెజ్ బిర్యానీ - రూ.1000


స్పెషల్ వెజ్ పకోడా - రూ.1000


ఎగ్ బిర్యానీ - రూ.500


షెజ్‌వన్ రైస్ - రూ.500


తలోజా జైలులో ఖైదీల పట్ల అధికారులు చూపిస్తున్న ఈ వివక్షపై తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. ఎప్పటినుంచో తలోజా జైలు అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌ సహా పలువురు వీఐపీ ఖైదీలు ఉన్న తలోజా జైలులో ఇలాంటి అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతో విచారణ జరుగుతోంది. ఈ వీఐపీ భోజనం వెనుక తలోజా జైలు అధికారి సునీల్ పాటిల్ సహా ఇతర అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల మధ్య ఖైదీలకు స్పెషల్ ఫుడ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com