ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. నిందితులకు ఉరిశిక్ష వేస్తామన్న సీఎం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 11:00 PM

పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని.. ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా.. కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై తీవ్రంగా గాయాలు అయినట్లు గుర్తించారు. అతి కిరాతకంగా ఆమెను హింసించి చంపినట్లు తేల్చారు. ఈ ఘటన బెంగాల్‌లో తీవ్ర దుమారం రేకెత్తడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని.. అవసరం అయితే ఉరిశిక్ష కూడా పడేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.


కోల్‌కతాలోని ఆర్‌ కర్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత అతి కిరాతకంగా ఆమెను హత్య చేసినట్లు 4 పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో డాక్టర్లు వెల్లడించారు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ నుంచి తీవ్రంగా రక్త స్రావం అయిందని తెలిపారు. ఇంకా ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించారు. ఈ ఘటనతో ఆ మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. అయితే అతడికి.. మెడికల్ కాలేజీతో సంబంధం లేదని గుర్తించారు.


మరోవైపు.. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఆ పీజీ మెడికల్ స్టూడెంట్‌పై తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య లైంగిక దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ - సిట్‌ను మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిందితులను పట్టుకునేందుకు ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉపయోగపడుతుందని పోలీసులు చెప్పారు. ఇదే ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బాధ్యులైన నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని.. వారిని కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు దీదీ హామీ ఇచ్చారు. అవసరం అయితే నిందితులను ఉరి తీస్తామని పేర్కొన్నారు.


ఈ ఘటనపై బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో లైంగిక దాడి చేసి తమ కుమార్తెను హత్య చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో నిజాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు జూనియర్ డాక్టర్లతోనే తన కుమార్తె ఉండి విధులు నిర్వర్తించిందని.. ఆ తర్వాత రెస్ట్ తీసుకునేందుకు కాన్ఫరెన్స్ హాల్‌ల్లోకి వెళ్లిందని తోటి డాక్టర్లు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఉదయం చూసే సరికి కాన్ఫరెన్స్ హాల్లో ఆమె చనిపోయి కనిపించిందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తెలిపారు. ఇంత దారుణంగా హత్య చేసిన నిందితులను సాధ్యమైంత త్వరగా పోలీసులు పట్టుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇక పీజీ వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా తోటి డాక్టర్లు శుక్రవారం రాత్రి కోల్‌కతాలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్.. ఈ కేసులో నిందితులను ప్రభుత్వం పట్టుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని.. దీనికి సిగ్గుతో తల దించుకుంటున్నానని చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. ప్రతిపక్ష బీజేపీ సీనియర్ నేత అగ్నిమిత్ర పౌల్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com