పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు రెజ్లర్ అమన్ సెహ్రావత్. 21 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. దీంతో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఈ 21 ఏళ్ల రెజ్లర్.. తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ దెబ్బకు చాలా కాలం పాటు కోలుకోలేకపోయాడు. ఓ దశలో డ్రగ్స్ తీసుకుందామనే ఆలోచనలు సైతం అతడిని వెంటాడాయి. కానీ తాత, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో వాటన్నిటినీ దాటుకుని.. భారత్‌కు ఒలింపిక్ మెడల్‌ను అందించాడు.
అమన్ సెహ్రావత్‌ది హర్యాణాలోని బిరోహార్ గ్రామం. అమ్మానాన్నకు ఇద్దరు పిల్లలు. అమన్‌కు ఓ సోదరి. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ పతకం సాధించాడు. దీంతో అతడిని స్ఫూర్తిగా తీసుకుని.. రెజ్లింగ్ దిశగా అడుగులు వేశాడు అమన్ సెహ్రావత్. అందుకు కుటుంబం సైతం ప్రోత్సహించింది. తండ్రి, తాతలు వెన్ను తట్టి ప్రోత్సహించారు. దీంతో మట్టిపై ప్రాక్టీస్ ప్రారంభించి.. ఆ తర్వాత బురదలో రెజ్లింగ్ చేసేవాడు. అతడి ఆసక్తి, ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు.. అమన్‌ను ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో చేర్పించారు. ఇక అప్పటి నుంచి నిరంతరం మెరుగుపడుతూ వచ్చిన అమన్.. రెజ్లింగ్‌పై మంచి పట్టు సాధించాడు.
సరదాగా సాగిపోతున్న అమన్ జీవితంలో ఊహించని కుదుపు ఎదురైంది. మానసిక సమస్యలతో అమన్ సెహ్రావత్ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే మరో షాక్ తగిలింది. భార్య ఎడబాటును తట్టుకోలేకపోయిన అమన్ తండ్రి.. ఏడాది తర్వాత మృతి చెందాడు. దీంతో 11 ఏళ్ల వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయి ఆనాథగా మారిపోయాడు అమన్. దీంతో అతడు కుంగుబాటుకు గురయ్యాడు. చెడు ఆలోచనలు కూడా అతడి మదిలో మెదిలాయి. దీంతో రెజ్లింగ్‌ను పక్కనపెట్టేశాడు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా మారిన అమన్‌కు పెదనాన్న సుధీర్ సెహ్రావత్, పెద్దమ్మ అండగా నిలిచారు. తాతయ్య కూడా అమన్‌ను మానసికంగా సిద్ధం చేసి.. తిరిగి రెజ్లింగ్ వైపు నడిపించాడు. వీళ్ల సాన్నిహిత్యంలో అమన్ పూర్తిగా మారిపోయాడు. అమ్మనాన్నల కోసమైనా.. వారికి ఇష్టమైన రెజ్లింగ్ వైపు దృష్టి సారించాడు. చిన్నవయసులోనే తనకంటే పెద్ద రెజ్లర్లను ఓడించాడు. తనదైన టెక్నిక్‌లు అలవరుచుకున్న ఈ రెజ్లర్.. 2008లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటాడు. కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 19 ఏళ్ల వయుసులోనే అండర్-23లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత కాస్త తబడ్డా మళ్లీ గాడినపడ్డాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన రెజ్లర్ రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించాడు అమన్. అదే జోరులో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి.. కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. పారిస్‌లో అతడు నెగ్గింది కాంస్యమే అయినా.. భవిష్యత్‌పై మాత్రం ఆశలు భారీగా పెంచేశాడు.