వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెల ఆందోళన ఓ వైపు కొనసాగుతుంటే.. మరోవైపు ఆదివారం కీలక ఘటన జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి.. గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస జాతీయ రహదారిపై తన కారుతో మరో కారును ఢీకొట్టి మాధురి ఆత్మహత్యకు యత్నించారు. అయితే, ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ, ఈ ఆత్మహత్యాయత్నంతో మాధురి ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పారు.
శ్రీనివాస్ భార్య వాణి, పెద్ద కుమార్తె హైందవి టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. శనివారం రాత్రి అక్కడే నిద్రించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఉన్న కారు షెడ్‌లో తాత్కాలికంగా మంచాలు, చైర్లు ఏర్పాటు చేసుకున్నారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడే బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తున్నారు. వీరిద్దరితో పాటు వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు, మరికొంత మంది సానుభూతిపరులు అక్కడే ఉన్నారు. వీరికి అండగా నిలబడేందుకు వాణి సొంతూరు లింగలవలసకు చెందిన మహిళలు కూడా అక్కడికి చేరుకున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ తమకు అన్యాయం చేశారని.. దివ్వెల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య వాణి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు రెండు రోజుల క్రితం ఆయన కుమార్తెలు ఇద్దరూ ఆందోళన చేయడంతో ఈ విషయం బాగా హైలైట్ అయ్యింది. ఆ తర్వాత వాణి, మాధురి వరుసగా మీడియా ముందుకు వచ్చి ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం వాణి, ఆమె కుమార్తెలు, కుటుంబ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ గొడవ జరిగింది. భార్య, బిడ్డల మీద దాడి చేసేందుకు సైతం శ్రీనివాస్ ప్రయత్నించారు.
ఈ ఘటన అనంతరం దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడిపై టెక్కలి పోలీసులకు వాణి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, భార్య వాణి, కుమార్తె హైందవి, మరో ముగ్గురిపై దువ్వాడ శ్రీనివాస్ కేసు పెట్టారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇంత జరిగాక తాను ఊరుకునేది లేదని.. వాణికి విడాకులు ఇస్తానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే, తన బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేది లేదని వాణి అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఈ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురిపై సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. వాణి సైతం మాధురి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై చనిపోవాలని అనుకుంటున్నట్టు మాధురి చెబుతున్నారు. తాను బతకలేనని.. చనిపోతానని టెక్కలిలో తన అనుచరులతో మాధురి చెప్పినట్టు తెలుస్తోంది. టెక్కలి నుంచి పలాసకు తన స్కోడా కారులో వెళ్తూ.. లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో హైవేపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మాధురి గాయపడ్డారు. ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మాధురి ఆత్మహత్యాయత్నంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.
అయితే మాధురి ఢీకొట్టిన కారు ఎవరిదనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మాధురి కారు ఢీకొట్టడంతో ఆగి ఉన్న మారుతి సుజుకి ఇగ్నిస్ కారు నుజ్జునుజ్జు అయ్యింది.సీటు బెల్టు పెట్టుకోవడం, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో దివ్వెల మాధురికి ముప్పుతప్పింది. అయితే ఇప్పుడు ఆ ఆగిఉ ఉన్న కారు ఎవరిదనేదీ ఆసక్తికరంగా మారింది.ఈ కారును ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా భావిస్తున్నారు.సుధాకరరావు అనే వ్యక్తి పేరు మీద భువనేశ్వర్‌లో ఈ కారు రిజిస్టర్ అయ్యింది. అయితే కారు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.