వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ పూర్వ ఎండీ మధుసూదన్‌రెడ్డి కనుసన్నల్లో జరిగిన మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఐదేళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్లు లెక్కలు చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి నెలా రూ. 14 కోట్ల చొప్పున 17 నెలల్లో రూ. 238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తోంది. జగన్ అండతో విచ్చలవిడిగా చెలరేగిపోయిన మధుసూదన్‌రెడ్డి సంస్థను రూ. 1,258 కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.2019లో ఏపీ ఫైబర్‌నెట్ కేబుల్ కనెక్షన్ల సంఖ్య సుమారు 9 లక్షలు. ప్రస్తుత రికార్డుల ప్రకారం సంస్థ చూపే కనెక్షన్ల సంఖ్య 5 లక్షలు. ఫైబర్‌నెట్ సేవలకు ప్రజల్లో ఆదరణ తగ్గడం వల్ల కనెక్షన్ల సంఖ్య తగ్గితే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ కొత్తగా మరో 20 లక్షల కనెక్షన్లు తీసుకునేందుకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనెక్షన్ల సంఖ్య తగ్గడం అనేది జరగదు. ఇక్కడే అసలు మతలబు ఉంది.అమల్లోకి ప్రీపెయిడ్ విధానం 2022 డిసెంబరు 10 నుంచి కొన్ని జిల్లాలు, 2023 జనవరి 10 నుంచి మిగిలిన జిల్లాలకు ప్రీ పెయిడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పోస్టు పెయిడ్ విధానం అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు ప్రతి నెలా బిల్లు మొత్తాన్ని సంస్థ బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ప్రీపెయిడ్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆపరేటర్లు నెల బిల్లులను ఓ యాప్ ద్వారా చెల్లించాలన్న నిబంధన తీసుకొచ్చారు.అప్పటి నుంచి కనెక్షన్ల సంఖ్య భారీగా తగ్గినట్లు చూపారు. వాస్తవానికి కనెక్షన్ల సంఖ్య తగ్గలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. ఎప్పటిలా ప్రతి నెలా యాప్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కేవలం సంస్థ రికార్డుల్లో మాత్రమే కనెక్షన్ల సంఖ్య తగ్గించి ఆ మేరకు 4 లక్షల కనెక్షన్లకు సంబంధించి నెల బిల్లుల కింద వసూలయ్యే మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక ఏజీఎం, డైరెక్టర్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.ఫైబర్‌నెట్ కనెక్షన్లకు సంబంధించి ఆపరేటర్లు ప్రతి నెల బిల్లులు చెల్లించడానికి ఉపయోగించిన యాప్‌ను గ్రీన్ లాంటెర్న్ అనే ఐటీ సంస్థ రూపొందించినట్లు సిబ్బంది చెబుతున్నారు. యాప్ ద్వారా ఆపరేటర్లు జరిపే చెల్లింపులు రికార్డుల్లో చూపిన కనెక్షన్ల సంఖ్య మేరకు ఫైబర్‌నెట్ ఖాతాకు మిగిలిన మొత్తం బినామీ ఖాతాకు జమయ్యేలా ప్రోగ్రామింగ్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం ముంబయిలోని ఒక బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు సమాచారం.కింది స్థాయి అధికారుల అక్రమాలు ఏకంగా సంస్థ ఉన్నతాధికారి విచ్చలవిడిగా వ్యవహరించడంతో కింది స్థాయిలో ఉన్న అధికారులు కూడా వారి పరిధిలో అక్రమాలకు పాల్పడ్డారు. ట్రిపుల్ ప్లే బాక్సుకు అద్దె రూపంలో ఒక్కో ఆపరేటర్ ప్రతి నెలా రూ. 59 చొప్పున సంస్థకు చెల్లించాలి. ఈ మొత్తాన్ని మాఫీ చేసి సొంత లాభం చూసుకునేలా కొందరు సిబ్బంది వ్యవహరించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ. 150 చొప్పున వసూలు చేసుకుని ఆ మేరకు కనెక్షన్ల సంఖ్యను తగ్గించి చూపారు. ఈ తరహాలో లక్ష కనెక్షన్లకు సంబంధించిన లెక్కలను గోల్‌మాల్ చేసి రూ. 1.50 కోట్లు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆపరేటర్ల నుంచి ప్రతి నెలా అద్దె రూపంలో సంస్థకు సమకూరే రూ.10 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.