యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి తమ కాళ్లపై తాము నిలబడేలా, ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడమే అసలైన సంక్షేమమని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలని, ఉచిత పథకాలు అవసరం లేదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట(విజయవాడ చాప్టర్)లో ఆదివారం గుడివాడకు చెందిన ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ, ఓట్ల కోసం, తాత్కాలిక రాజకీయ లబ్దికోసం ప్రభుత్వాలు అవసరంలేని ఉచితపథకాలు తీసుకొస్తున్నాయని, దీనివల్ల ప్రజలకు దీర్ఘకాలికంగా లాభంకంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. ప్రజలు చేయిచాచే పరిస్థితిలో లేకుండా ఆత్మగౌరవంతో జీవించేలా చేయడంపై పాలకులు దృష్టి సారించాలని సూచించారు.