ఆక్వారంగాన్ని అన్నివిధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్‌ది యునైటెడ్ నేషన్ (ఎఫ్‌ఎవో), బృందం ‘సస్టెయినబుల్ ఆక్వాకల్చర్ ఇన్ ఏపీ’ అంశంపై అధ్యయనం నిమిత్తం వచ్చిన కేంద్ర బృందంతో కలిసి మచిలీపట్నంలోని గిలకలదిండి హర్బర్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం ఆక్వాసాగు రైతులతో, మత్స్యకారులతో మాట్లాడి ఇక్కడి అనుకూల, ప్రతికూల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, గిలకలదిండి హర్బర్‌నుంచి మత్స్యసంపద ఎగుమతులు తదితర అంశాలను మంత్రి కేంద్రబృందానికి వివరించారు. సముద్రంలో అరుదైన చేపల జాతులు అంతరించి పోతున్నాయని, వాటిని సంరక్షించే విషయంలో పూర్తిస్థాయి అధ్యయనం జరిగేలా ప్రతిపాదన చేయాలని మంత్రి కోరారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తికి మడ అడవులు ఆవాసంగా ఉన్నాయన్నారు. మడఅడవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సముద్రంలో చేపలవేటకు సోలార్ సోనాబోట్‌లను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చి మత్స్యకారులు తక్కువ ఖర్చుతో చేపలవేట కొనసాగించేందుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగరమాల ద్వారా తీరప్రాంత రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు. నేడు కేంద్రమంత్రి గడ్కరీని కలిసి ఈ అంశంపై వినతిపత్రం అంద జేయనున్నట్టు మంత్రి తెలిపారు.