మరో ఉద్దానంగా మారకముందే ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లోని గిరిజన తండాలకు కృష్ణాజలాలు అందించాలని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం తిరువూరు సుంకర వీరభద్రరావు భవనం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని, జిల్లాలోని పలు మండలాల్లో సిలికాన్, ఫ్లోరైడ్‌తో నిండిన విషపూరిత నీటిని తాగుతూ ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎ.కొండూరు మండలంలోని గిరిజన తండాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సీపీఐ ఆందోళన చేస్తే, కొంతమేర తాగునీటి సరఫరా జరిగిందన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తాగునీటి సరఫరాను నిలిపివేసిందన్నారు. కొండపల్లి ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించాలని, కిడ్నీ బాధిత ప్రాంతాలకు కృష్ణాజలాలు సరఫరా చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఎ.కొండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు సీపీఐ 100 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిందని, ప్రజలు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. సీపీఐ నాయకులు తూము కృష్ణయ్య, నాగుల్‌మీరా, ఉదయ్, చిలుకూరి వెంకటేశ్వరరావు, షేక్ సుభాని పాల్గొన్నారు.