ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి తహసీల్దార్‌తో పాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి అర్జీని ఆన్‌లైన్ చేసి దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతామని అన్నారు. రీ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం భూ సమస్యలను మరింత జటిలం చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు, 22 ఏ భూములు దోపిడీకి గత ప్రభుత్వ పెద్దలు పాల్పడ్డారని ఆరోపించారు. భూ దోపిడీతో చాలా గ్రామాల్లో భూ సమస్యలు పద్మవ్యూహలను తలపిస్తున్నాయని చెప్పారు. తగాదాలకు కారణం అవుతున్న భూమి రిజిస్ట్రేషన్‌లలో తేడాలు ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న గ్రామాల్లో సగం రోజు సదస్సుల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.