ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మీ కాలనీకి తీసుకువస్తానని విజయవాడ 9వ డివిజన్ లోని నారా చంద్రబాబు నాయుడు కాలనీ వాసులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. త్వరలోనే కాలనీ వాసులకు కృష్ణానది నీటిని అందిస్తామన్నారు. ఆదివారం ఆయన కాలనీలో పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీవాసుల సమావేశంలో మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ కాలనీ ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడం ద్వారా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లాలని చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. రూ.70 కోట్లతో ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు. కాలనీ అధ్యక్షుడు కె.బలరామ్, కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీ, చెన్నుపాటి గాంధీ, యలమంచిలి దేవేంద్ర, ముమ్మనేని ప్రసాద్, బాబీ, సీహెచ్ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.