‘మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి. యువత వాటి బారిన పడకుండా చర్యలు చేపట్టాలి. దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలి’ అని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ‘నాషాముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ‘దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లాల్సింది విద్యార్థినీ, విద్యార్థులే. వారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఒక్కసారి ఎన్‌పీడీఎస్ యాక్టులో పేరు నమోదైతే సమాజంలో ఉనికిని కోల్పోతారు. మాదకద్రవ్యాల వినియోగం వలన అనారోగ్యాలు తలెత్తుతాయి. మాదకద్రవ్యాలను అరికట్టేందేకు ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వహించాలి’ అని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ తదితరులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ దుర్గాప్రసాద్, డీవీఈవో తవిటినాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీఎస్ సత్యనారాయణ, ఎన్‌సీసీ పోలినాయుడు, డీఎఫ్‌వో ప్రతినిధి నాగేంద్రరావు, నారాయణ, శ్రీచైతన్య, తిరుమల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్స్ పాల్గొన్నారు.