స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడి అశువులుబాసిన ఎందరో అమరవీరుల త్యాగాలు మన భారతావనికే గర్వకారణమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు ఉద్యమబాటపట్టి, తెనాలిలో బ్రిటిష్ పాలకుల తుపాకులకు బలైన ఏడుగురు అమరవీరులకు సోమవారం ప్రభుత్వం తరపున ఘనంగా నివాళులర్పించారు. తెనాలి గాంధీ చౌక్ నుంచి రణరంగ చౌక్ వరకు భారీ ర్యాలీతో, ఎన్సీసీ క్యాడెట్‌ల కవాతు మధ్య మంత్రి మనోహర్ చేరుకున్నారు. భరతమాత విగ్రహానికి పూలమాలలువేశారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరవీరుల స్థూపాల దగ్గర పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. దేశం కోసం వారు చేసిన నిస్వార్థ త్యాగం మనకు ఆదర్శం కావాలన్నారు. స్వాతంత్య్రం కోసం అమరులైన వీరులను భావితరాలు గుర్తుంచుకునే విధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా తెనాలిలో ఏటా సంస్మరణ కార్యక్రమం ప్రభుత్వం తరపున నిర్వహించుకోవటం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జేసీ భార్గవ్‌తేజ, సబ్‌కలెక్టర్ ప్రఖర్ జైన్, డీఎస్పీ రమేష్, మున్సిపల్ చైౖర్‌పర్సన్ రాధిక, కమిషనర్ శేషన్న, ఎన్‌సీసీ అధికారులు, విశ్రాంత సైనికోద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.