ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ఉద్యోగ విద్యార్హత, ప్రవేశ పరీక్షలు, నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతాయని, అలా కాకుండా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మవద్దని ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూచించారు. ప్రతి సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఎస్పీతో పాటు ఏఎస్పీ స్వరూపరాణి, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 50 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే నమ్మవద్దని ఇలాంటి వారి సమాచారం 95503 51100కు అందించాలన్నారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారందరికీ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు.