తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటి సమస్యలు తలెత్తకూడదని, అందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం ఎమ్మెల్యే జేసీ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా చూడాలన్నారు. వాటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తనదృష్టికి తీసుకురావాలన్నారు. పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్ వద్ద అదనంగా బోర్లు వేయడం వల్ల యాడికి మండలానికి తాగునీరు ఇవ్వడానికి వీలవుతుందని ఎమ్మెల్యే దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. రిజర్వాయర్, పెండేకల్లు పంప్‌హౌస్, పెద్దపప్పూరు పంప్‌హౌస్ వద్ద కొన్ని మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని తెలిపారు. పెండేకల్లు నుంచి యాడికికి పైప్‌లైన వేస్తే తాగునీటి సమస్య ఉండదని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లడుతూ యాడికి మండలంలోని కేశవరాయునిపేట, దైవాలమడుగు, లక్షుంపల్లి గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారానికి రాయలచెరువు నుంచి చందన వరకు పైప్‌లైన వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట, నామనాంకపల్లి, వరదాయపల్లి గ్రామాలకు తాగునీటి సమస్యను తీర్చేందుకు నామనాంకపల్లి వద్ద సంపును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈ శ్రీరాములు, జేఈలు దేవకుమార్, మహే్‌షబాబు, ప్రసాద్‌రెడ్డి, సూర్యనారాయణలు పాల్గొన్నారు.