బీసీలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా... సొంత కాళ్లపై నిలబడేలా ప్రణాళికలు రచించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. దీనికోసం... కేంద్ర ప్రభుత్వ పథకాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. బీసీల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు ఉపకరించేలా కేంద్రం పలు పథకాలు అమలు చేస్తుండటంతో... వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం విశ్వకర్మ యోజన, జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు తదితర పథకాలను ఉపయోగించుకుని... రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహకారం అందిస్తే ఏటా 5 లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి కల్పించవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ‘ఆదరణ’ వంటి పథకాలతో బీసీలకు అండగా నిలిచింది. బీసీలనే వెన్నెముకగా భావిస్తూ వారి స్వయంసమృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. బీసీలకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలిచ్చి స్వయం ఉపాధి యూ నిట్లు పెట్టుకునేలా చూస్తూ వచ్చింది.