ఏపీలో అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు శాఖలపై చంద్రబాబు దృష్టిసారించారు. గత వైసీపీ పాలనలో ఆయా శాఖలలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేశారు. అలాగే అనేక శాఖల్లో పరిస్థితి ఎలా ఉందనేదానిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఈరోజు వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. విద్యా శాఖ, స్కిల్ డెవలెప్మెంట్‌పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అలాగే టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీపై రివ్యూ చేపట్టనున్నారు. జగనన్న కిట్ల పేరుతో గత ప్రభుత్వ అక్రమాలు, సీబీఎస్ఈ స్కూళ్ల పని తీరు, విద్యా విధానంలో తీసుకు రావాల్సిన మార్పులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. స్కిల్ సెన్సస్ అమలుపై చర్చించనున్నారు. స్కిల్ సెన్సస్ ద్వారా వచ్చిన డేటాను సమగ్రంగా విశ్లేషించి.. ఉపాధి కల్పించే అంశంపై రూపొందించాల్సిన ప్రణాళికలపై చంద్రబాబు చర్చ జరపనున్నారు. అలాగే టూరిజం ద్వారా సేవల రంగాన్ని మరింత విస్తృత పరిచే అంశంపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఎకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి అంశాలపై సమీక్ష చేస్తారు. ఏపీలో సినిమా షూటింగులకు అనువైన ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ పనులపై ఆరా తీయనున్నారు. తమిళనాడు బోర్డరు చెన్నై సమీపంలో ఫిల్మ్ సిటీ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలపైనా సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.