నూతన పారిశ్రామిక విధానంపై తాజాగా నిర్వహించిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలోని టాప్-5 రాష్ట్రాలతో పోటీపడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. ఈ దిశగానే చంద్రబాబు దూసుకెళ్లడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. వృద్ధి రేటు15 శాతానికిపైగా సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై ముసాయిదాను రూపొందించిన విషయం తెలిసిందే. దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అధికారులకు ఈ నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు.