దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, 1956 నవంబర్ 1న ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని చెప్పారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవరూ ఉహించని విధంగా సంస్కరణలతో 13.5 శాతం వృద్ధి రేటు రాష్ట్రం సాధించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచిందని, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నామని, దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.