ఎందరో మహనీయుల త్యాగం, మరెందరో దేశ భక్తుల బలిదానాలు ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామని శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు స్పష్టం చేశారు. మన మహనీయుల త్యాగాల స్ఫూర్తిని భావి తరాలకు అందించాలన్నదే గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమని తెలిపారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా పంచాయతీలను బలోపేతం చేయడం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శ్రీ హరిప్రసాద్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదట చేబ్రోలులోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి గృహంలోనూ, పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాలలోనూ, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లోని చిన్నమాంబ పార్కు, యు.కొత్తపల్లి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలల్లో జెండా వందనం నిర్వహించారు. భారీ జాతీయ పతాకంతో విద్యార్ధులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ.. "భారత దేశ దాస్య శృంఖల విముక్తి కోసం ప్రాణాలు త్యాగం చేసిన మన మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యం. వారి జీవితాన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు వెళ్లాలి. చిన్నతనంలో నేను కూడా మున్సిపల్ స్కూలులోనే చదువుకున్నాను. ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఉన్న ఎంతో మంది ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. వారి స్ఫూర్తితో విద్యార్ధులు ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలి.
•గ్రామ గ్రామాన ఘనంగా స్వతంత్ర వేడుకలు జరగాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దేశం అంటే అమితమైన గౌరవం. గ్రామ గ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తి తొణికిసలాడాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకు అనుగుణంగా స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. గత ప్రభుత్వాల నామ మాత్రంగా కేటాయింపుల వల్ల పంచాయతీల్లో ఆగస్టు 15 వేడుకలను నిర్వహించేందుకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో సమీక్షలు నిర్వహించినప్పుడు జెండా వందన కార్యక్రమానికి నిధుల కేటాయింపు తక్కువగా ఉన్న విషయాన్ని గమనించారు. వెంటనే జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు చేపట్టారు. మేజర్, మైనర్ పంచాయతీలకి రూ. 10 వేలు, రూ. 25 వేలు చొప్పున కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నేటి రోజున గ్రామ గ్రామాన జెండా పండుగ ఘనంగా నిర్వహించేందుకు ఆయన నిర్ణయం దోహదపడింది. ఇది ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తుంది" అన్నారు. ఈ కార్యక్రమాల్లో పిఠాపురం నియోజక వర్గం జనసేన సమన్వయకర్త శ్రీ మరెడ్డి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు
.