డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పవన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం. ఆపై ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించాయన్నారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు. అందుకే శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లలు, సగటు ప్రజల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదన్నారు. ఇదే విషయం కలెక్టర్, ఎస్పీల సదస్సులోనూ స్పష్టం చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నా భిన్నం అయిపోయిందని విమర్శించారు. జల జీవన్ మిషన్ ప్రాజెక్టులకు పైపులు వేసి మంచి నీటి వసతి ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే గత ప్రభు త్వం ఋషికొండ ప్యాలెస్ లాంటి విలాస భవనాలను నిర్మించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.