పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాగులో కొట్టుకుపోయి ఓ ప్రభుత్వ టీచర్ కన్నుమూసింది. సాలూరు మండలం సరాయివలస గ్రామం ఒట్టిగెడ్డవాగులో ఈ విషాదం చోటుచేసుకుంది. మరో వ్యక్తి చెట్టు కొమ్మల సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మన్యం జిల్లాలో గత రెండుమూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే సాలూరు మండలంలోని ఒట్టిగెడ్డ వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఏకలవ్య పాఠశాలకు చెందిన ఆర్తి అనే ఉపాధ్యాయురాలు, వార్డెన్ మహేష్ ఇద్దరూ కలిసి బైక్ మీద వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే మధ్యలోకి వెళ్లేసరికి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఇద్దరూ వాగులో గల్లంతయ్యారు.
అయితే ఓ చెట్టు కొమ్మ సాయం దొరకడంతో మహేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ టీచర్ ఆర్తి మాత్రం వాగులో కొట్టుపోయింది. ఈ ఘటనపై మహేష్ వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికులు కూడా వాగులో గాలించినా ఉపయోగం లేకపోయింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే మంత్రి ఉషారాణి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో గల్లంతైన ఉపాధ్యాయురాలి కోసం వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది ఆర్తి కోసం తీవ్రంగా గాలించారు. అయితే శుక్రవారం ఆర్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వాగు నుంచి వెలికి తీసిన పోలీసులు.. ప్రభుత్వాసుపత్రికి పంపించారు. మరోవైపు గల్లంతైన ఆర్తి శవంగా తేలటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటించారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తెల్లవారి వరాహలగడ్డ ప్రవాహం పెరగడంతో వరదనీరు గణేష్ నగర్ కాలనీ లోకిచేరింది.రహదారులు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పరిస్థితిని సమీక్షించారు. స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.