బొబ్బిలి పట్టణ పరిధిలోని శ్మశాన వాటిక మైదానంలో బొబ్బిలి సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాకు చెందిన నాగాలాపురం లోహిత్, అలియాస్ లోహిత్ భరత్ నుంచి ఆరు కిలోలు, బొబ్బిలి పట్టణానికి చెందిన చింతాడ సారథి అలియాస్ నాని నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలికి చెందిన శిమిడి ప్రేమ్ కుమార్, లంకా నిఖిల్, దేవుపల్లి చందన్ అలియాస్ భంజు గంజాయి వ్యాపారంలో సహాయ పడినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరితో పాటు ముగ్గురు జువెనైల్స్ కూడా అక్రమంగా గంజాయిని తరలించడంలో సహకరించడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. లోహిత్, భరత్పై ఇప్పటికే పార్వతీపురం పట్టణంలో గంజాయి కేసు నమోదైందని తెలిపారు. ఈ సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్బీ సీఐలు విజయనాథ్, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.