ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో సీఎం చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరనున్న సీఎం.. 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీకి వెళ్తారు. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన 15 సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు సోమవారం ప్రారంభిస్తారు. అలాగే మరో ఏడు సంస్థలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే మరో రూ.1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల తర్వాత శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశమవుతారు. శ్రీసిటీ పర్యటన తర్వాత నెల్లూరు జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు.. సోమశిల సాగునీటి ప్రాజెక్టును సందర్శిస్తారు. తిరిగి సాయంత్రానికి ఉండవల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. శ్రీసిటీలో రేపు (ఆగస్ట్ 19) సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా.. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, జపాన్, జర్మనీకి చెందిన సంస్థలతో పాటుగా దేశీయ సంస్థలు కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.
చంద్రబాబు చేతుల మీదుగా కార్యకలాపాలు ప్రారంభమయ్యే సంస్థలు ఇవే..
ఎల్‌జికెమ్ (దక్షిణ కొరియా)
నియోలింక్ (ఇజ్రాయెల్)
నైడిక్ (జపాన్)
బెల్ (జర్మనీ)
ఓజేఐ ఇండియా ప్యాకేజ్
అడ్మైర్
బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్స్
ఇఎస్‌ఎస్‌కేఏవై
ఆటోడేటా
ఈప్యాక్
ఎవర్‌షైన్
జెన్‌లెనిన్
జేజీఐ
త్రినాథ్
వీటితో పాటుగా బెల్జియం సంస్థ వెర్మేరియన్, చైనాకు చెందిన ఎన్‌జీసీ, జపాన్ సంస్థ ఏజీ ఆండ్ పీలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే యూఏఈ, సింగపూర్, జపాన్ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. వీటితో పాటు మనదేశానికి చెందిన స్వదేశీ కంపెనీతోనూ ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. అనంతరం తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం బయల్దేరి వెళ్తారు.