ఏపీవాసులారా.. బీ అలర్ట్.. వచ్చే రెండు రోజులు ఏపీలో భారీవర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆవర్తనం ప్రభావంతో ఆదివారం.. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, విశాఖప, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఉత్తర కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. దీని ప్రభావంతో సోమవారం కూడా కొన్ని భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. సోమవారం.. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, ప్రకాశం, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అంచనా వేశారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ పలు హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షంతో పాటుగా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో వర్షం పడుతున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని సూచించింది. అలాగే పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని హెచ్చరించింది.
తెలంగాణలో భారీ వానలు
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.