ఏపీలో మరిన్ని కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ విషయమై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భేటీ వివరాలను వెల్లడించారు. ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ పనులు జరుగుతున్నాయన్న రామ్మోహన్ నాయుడు.. పనులను త్వరగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మాణంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అదనంగా మరిన్ని కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్న రామ్మోహన్ నాయుడు.. ఎయిర్ పోర్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం భూమిని గుర్తిస్తే తమ శాఖ తరఫున సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని సూచించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. శ్రీకాకుళం, కుప్పం, నాగార్జునసాగర్, దగదర్తితో పాటుగా.. తుని, అన్నవరంలో కూడా ఎయిర్‌పోర్టులు నిర్మించే ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్ అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఒంగోలులోనూ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు తెలిపారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రైవేట్ అధీనంలో ఉన్న ఎయిర్ పోర్టును కూడా పబ్లిక్ ఎయిర్‌పోర్టుగా చేసే విషయమై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అక్కడి ఆర్గనైజేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూర్చుని ఈ విషయమై చర్చిస్తే.. రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడిపే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మొత్తంగా ఏపీలో ఉన్న ఏడు ఎయిర్‌పోర్టులను 14 విమానాశ్రయాలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు సూచించిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థలం, విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి అధ్యయనం చేస్తామన్న ఆయన.. అన్నీ కుదిరిన చోట త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈస్ట్ కోస్టుకు లాజిస్టిక్ హబ్‌గా ఏపీని తయారు చేయాలనేదే చంద్రబాబు ఆలోచనగా చెప్పిన రామ్మోహన్ నాయుడు.. అందుకే ఇన్ని ఎయిర్ పోర్టుల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు.