దేశంలో సంచలనం రేపిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం (ఆగస్ట్ 20) ఈ కేసు మీద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ట్రైనీ డాక్టర్ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు, నిరసనలు పెల్లుబికుతున్న వేళ.. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించాలంటూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐకు లేఖ రాశారు.
ఈ నేపథ్యంలోనే సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సుమోటోగా స్వీకరించడం ద్వారా ఘటనపై అధికారికంగా ఎలాంటి పిటిషన్ దాఖలు కాకుండానే న్యాయస్థానం సొంతంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. మరోవైపు ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్యులకు భద్రతాపరమైన చర్యలు పెంచాలని కోరుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై బాధితురాలి తల్లి కీలక వివరాలు వెల్లడించారు. మీ కూతురు అనారోగ్యంగా ఉందని తనకు మొదటగా కాల్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత కాల్ కట్ అయ్యిందని.. వెంటనే ఫోన్ చేసి ఏమైందని అడిగితే ఆస్పత్రికి రమ్మన్నారని వెల్లడించారు. మళ్లీ ఫోన్ చేస్తే.. మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారని వాపోయారు. తన కుమార్తె గురువారం డ్యూటీకి వెళ్లిందని.. శుక్రవారం రాత్రి 10:53 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తాము అక్కడికి చేరుకున్న తర్వాత.. తమ కూతుర్ని చూడటానికి అనుమతించలేదన్నారు.
మూడు గంటలకు అనుమతిచ్చారని.. లోపలికి వెళ్లి చూస్తే ప్యాంట్ ఓపెన్‌లో ఉందని.. శరీరంపై ఓ వస్త్రం మాత్రమే ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. చేయి విరిగిందని.. కళ్ల నుంచి, నోటి నుంచి రక్తం వస్తోందని.. ఎవరో హత్య చేసినట్లుగా అనిపించిందన్నారు. వెంటనే ఇది ఆత్మహత్య కాదు.. హత్య అని వారికి చెప్పానన్నారు. కూతుర్ని డాక్టర్ చేయడానికి చాలా కష్టపడ్డామని.. కానీ ఆమె హత్యకు గురైందని ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
మరోవైపు సీబీఐ.. ఈ కేసులో ప్రధాన నిందితుడికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన సైకాలజీ నిపుణులు అతని మానసిక పరిస్థితని విశ్లేషిస్తున్నారు. వీరికి తోడుగా సీబీఐకి చెందిన సైకాలజిస్ట్ కూడా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా మూడు రోజుల పాటు విచారించింది.