దొంగిలించిన సొమ్మును దొంగలు వాటాలు వేసుకున్న సీన్‌లు తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు. అచ్చం అలాంటి సీన్ ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. కానీ, ఇక్కడ సొమ్ము పంచుకున్నది దొంగలు కాదు పోలీసులు. ట్రాఫిక్ పోలీసులు వాటాలు పంచుకుంటూ కెమెరాకు చిక్కారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారుల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును నిజాయితీగా వాటాలు వేసుకున్నారు. ఢిల్లీలోని ఘాజీపూర్ థ్రిల్ లౌరీ సర్కిల్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. తమ వాటాల పంపకం సీసీటీవీ కెమెరాలో రికార్డవుతోందనే విషయం మరిచిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. చివరకు విషయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరకు చేరింది. దీంతో తీవ్రంగా స్పందించిన ఆయన.. సదరు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ‘లంచం సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్- ఇన్‌స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశాం.. ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం... శాఖాపరమైన విచారణకు ఆదేశించాం’ అని ఎల్జీ వీకే సక్సేనా ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక చిన్నపాటి సంభాషణ తర్వాత.. తమ వెనుక ఉన్న టేబుల్‌పై నోట్ల కట్టను ఉంచిన వ్యక్తికి పోలీసు సైగలు చేయడం.. ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత ఓ పోలీసు కూర్చుని డబ్బును లెక్కించడం.. ముగ్గురు ఆ మొత్తాన్ని వాటాలు వేసుకోవడం అంతా అందులో రికార్డయ్యింది. తమకు లంచంగా వచ్చిన వాటాలను వారు నవ్వుతూ అందుకుంటుండటం వీడియోలో స్ఫష్టంగా ఉంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సస్పెన్షన్ కేవలం హాలీడే లాంటిది అని ఒకరు.. ఢిల్లీలో ఇలాంటివి సర్వసాధారణమని మరొకరు కామెంట్ పెట్టారు. అయితే, చిన్నస్థాయిలో ఉన్నవారు దొరికిపోయి శిక్ష అనుభవిస్తున్నారు.. కానీ, పెద్ద తలకాయలను మాత్రం రక్షిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.