రాఖీ పండుగ ఆ కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. కూతురిని తీసుకొని కొడుకు వద్దకు వెళ్లి రాఖీ కట్టించిన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కొత్తపేటలోని సంతోష్‌నగర్‌కి చెందిన కనకాల అమ్మిరాజు, సత్యవేణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు శ్రీరామ్ రాజ మహేంద్రవరం శివారు కాతేరులోని తిరుమల కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో కూతురు వైష్ణవి, అన్నయ్య గుర్రాల దుర్గారావుతో కలిసి తిరుమల కళాశాలకు వెళ్లా రు. తమ్ముడు శ్రీరామ్‌కి వైష్ణవి రాఖీ కట్టింది. అందరూ కలిసి భోజనం చేసి కాసేపు ఆనందంగా గడిపారు. మధ్యాహ్నం 3.30సమయంలో తిరు గు ప్రయాణమయ్యారు. కళాశాలకు కొద్ది దూరంలో వంతెనపై వెళ్తుండగా ఒడిశా నుంచి పేపర్ మిల్లుకు కర్రల లోడుతో వస్తున్న వ్యాను వీరి బైక్‌ని బలంగా ఢీకొంది. వ్యాన్ డ్రైవరు చబుద్రప్రధాన్ తాగిన మైకంలో దారి తప్పడంతో పేపర్‌మిల్లు దాటిపో యి సుమారు 3 కిలోమీట ర్లకుపైగా వెళ్లిపో యాడు. అదే సమయంలో రాజ మహేంద్రవరం వైపు ఆ ముగ్గురూ బైక్‌పై వస్తున్నారు. వంతెన పైకి రాగానే కుడివైపు వెళ్తున్న వ్యాన్‌ని మద్యం మత్తులో ఎడమ వైపునకు అకస్మాత్తుగా తిప్పడం తో బైక్‌ని బలంగా ఢీకొంది. దీంతో బైక్ వెనుక చివరన కూర్చున సత్యవేణి వెనక్కి పడిపో వడం తో తలకు వంతెన సిమెంటు ప్లాట్‌ఫాం బలంగా తగిలి తీవ్రగాయ మై అక్కడికక్కడే మృతి చెందింది. వైష్ణవి, దుర్గారావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటన జరిగిన తర్వాత స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. వారిలో ఒకరు 108కి ఫోన్ చేశారు. అయితే ధవళేశ్వరం నుంచి వచ్చే వాహనం లేదని.. రాజానగరం నుంచి పంపిస్తామని చెప్పారు. ఫోన్‌లు చేసినా ఫలితం లేదు. ఈలోపు ఆటోలో ఆస్పత్రికి తరలించడానికి సన్నద్ధమవుతుండగా.. అరగంట దాటిన తర్వాత 108 వచ్చింది. అప్పటికే వైష్ణవి తలకు బలమైన గాయం కావడంతో రక్తమోడు తూ దాదాపుగా స్పృహ కోల్పోయింది. దీంతో స్థానికులు 108పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వాహనం ఆలస్యం వల్లనే వైష్ణవి పరిస్థితి విషమంగా మారిందని ఆవేదన చెందారు. వ్యాన్ డ్రైవర్ చబుద్రప్రధాన్ నిర్లక్ష్యమని ప్రాథమికంగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని సీఐ అప్పారావు తెలిపారు.