పశ్చిమగోదారి జిల్లా తణుకు ఆర్టీసీ బస్సు సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగును జాగ్రత్తగా తిరిగి అప్పగించారు. మంగళవారం హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ నుంచి తణుకు నైట్ రైడర్ బస్సు వచ్చింది.. అదే బస్సులో ప్రయాణించిన పేర్ల ప్రదీప్ అనే ప్రయాణికుడు రూ.ఆరు లక్షల విలువైన బంగారు ఆభర ణాలు ఉన్న బ్యాగ్ మర్చిపోయి విజయవాడలో దిగిపోయాడు. ఆ తర్వాత తణుకు వచ్చిన తర్వాత బస్సులో బ్యాగును డ్రైవర్లు యన్నం వెంకట గోపాలరావు, పెనుమత్స శ్రీనివాసరాజులు గమనించారు.
వెంటనే ఆ బ్యాగును తీసుకుని తణుకు డిపో మేనేజర్ గిరిధర్‌కు అప్పగించారు. మేనేజర్ బ్యాగు మర్చిపోయిన ప్రయాణికులు ప్రదీప్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన విజయవాడ నుంచి తణుకు వచ్చి ఆ బ్యాగ్ తీసుకున్నాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నిజాయితీగా వ్యవహరించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని డీఎం అభినందించారు. అలాగే తన బ్యాగును జాగ్రత్తగా తిరిగి ఇచ్చినందుకు ప్రయాణికుడు ప్రదీప్ కూడా డ్రైవర్లకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు కొవ్వూరు నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిపో నుంచి రాత్రి 6.45 గంటలకు బస్సు బయల్దేరి పెద్దేవం, తాళ్లపూడి, పోలవరం, డొండపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ వెళుతుంది. ఈ సర్వీసును అశ్వారావుపేట నుంచి హైదరాబాద్ వరకూ నాన్‌స్టాప్ సర్వీసుగా నడుపుతున్నారు. ఇదే బస్సు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు నాన స్టాప్ సర్వీసుగా నడుస్తుంది.
రెండో బస్సు రాజమహేంద్రవరం నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరుతుంది.. కొవ్వూరు బైపాస్ రోడ్డు మీదుగా.. తాళ్లపూడి, గజ్జరం, గోపాలపురం మీదుగా కొయ్యలగూడెం, జంగారెడ్డి గూడెం, అశ్వారావుపేట మీదుగా హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ చేరుకుంటుంది. ఈ బస్సును జంగారెడ్డి గూడెం వరకు నాన్ స్టాప్ సర్వీసుగా నడుపుతున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. అలాగే తాడేపల్లిగూడెం డిపో నుంచి నూతన సూపర్ లగ్జరీ బస్సులను స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ బస్సు కూడా హైదరాబాద్‌కు నడుస్తోంది.