ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి మనసు మార్చుకున్నారు. వీఆర్ఎస్ వద్దు, మళ్లీ సర్వీస్‌లోకి వస్తానంటున్నారు. ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విమరణ చేశారు.. ఇప్పుడు మనసు మార్చుకుని, మళ్లీ సర్వీసులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తాను వీఆర్ఎస్ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నానని.. మానసిక ఒత్తిడి కారణంగా అలా చేశానని చెబుతున్నారట.
తనను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కోరుతున్నారట. ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వంలోని ముఖ్యుల్ని కలసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. అయితే ఆయన్ను కలిసేందుకు వారు ఇష్టపడలేదని.. ఆయన విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోకూడనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. అలాగే ఆయన చుట్టూ కొన్ని వివాదాలు వచ్చాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనను జీఏడీకి సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే తాను వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు మూడు నెలల ముందస్తు నోటీసు ఇస్తూ జూన్ 25న లేఖ సమర్పించారు. అయితే సెప్టెంబరు 30తో నోటీసు గడువు ముగిసేలోగా ఆయన వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంది.
ఇంతలో ట్విస్ట్ ఇస్తూ.. వారం రోజుల వ్యవధిలోనే ఆయన వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వం ఆ జీవో సెప్టెంబరు 30 తర్వాత ఆమలులోకి వస్తుందని తెలిపింది. అప్పటి వరకు ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్రంలోనే ఉండాలి.. ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వదు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ మార్చుకుని మళ్లీ సర్వీస్‌లోకి తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ ప్రకాష్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు పడింది. సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా, జీఏడీ (రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏకకాలంలో రెండు పోస్టులు నిర్వహించారు. ఆ తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.
విశాఖలో విలాసవంతమైన భవనాలకు రుషికొండను ఎంపిక చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పాత్ర ఉందనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో.. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపు వంటి అంశాాల్లో నిర్ణయాలపై ఆరోపణలు వచ్చాయి. మరి ప్రవీణ్ ప్రకాష్ రిక్వెస్ట్‌పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.