ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్ కన్సెంట్ (సాధారణ సమ్మతి) ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే.. ఏపీ భూభాగంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకునేందుకు, అమలు చేసేందుకు వీలు ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946లోని సెక్షన్ 6 ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాలు, దేశంలో రైల్వేశాఖ పరిధిలోని భూభాగం మినహా ఎక్కడైనా సీబీఐ దాడులు, దర్యాప్తు చేయాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాల భూభాగంలో సీబీఐకి పరిధి కల్పించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని నెలలు మినహాఎప్పటికప్పుడు ఈ సమ్మతిని పొడిగిస్తూ వస్తోంది.
తాజాగా మరోసారి సీబీఐకి సాధారణ సమ్మతిని పొడిగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. జులై ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ఉత్తర్వుల్లో తెలిపారు. మరోవైపు 2014-19 టీడీపీ హయాంలో సీబీఐకి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 2018లో రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పునరుద్ధరించారు.
సీబీఐకి ఆయా రాష్ట్రాల నుంచి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోతే.. ఆ రాష్ట్రాల్లో దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ప్రత్యేకంగా కోర్టు ఆదేశిస్తే మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవు. అంతేకాదు సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తేనే సీబీఐ దర్యాప్తు ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ ఎప్పుడో రద్దు చేసింది. అయినా కోల్‌కతా డాక్టర్ కేసును సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతి తిెలిసిందే. అయితే ఈ లోపు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందిజ. సీబీఐ కూడా వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.