ఇటీవల కోల్ కతా లో ట్రైని డాక్టర్ మౌమిత దేవనాద్ అత్యాచార సంఘటనను నిరసిస్తూ ఆముదాలవలస పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు పార్టీ శ్రేణులతో కలిసి కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని వన్ వే జంక్షన్ మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం వన్ వే జంక్షన్ వద్ద మనవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయని అన్నారు. ఘటన జరిగి దాదాపుగా రెండు వారాలు కావస్తున్న నేటికీ నేరస్థులకు శిక్ష ఖరారు కాకపోవడానికి గల కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం లేదని, ఇది నిజమైన స్వాతంత్రం ఎలా అవుతుందని వాపోయారు. దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహ కలిగి మహిళలకు ఉన్న గౌరవాన్ని పెంచాలని కోరారు. అలాగే మన న్యాయ వ్యవస్థ కూడా నిందితులను వెంటనే శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బలమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు, మండల నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.