దేశంలో ఉన్న రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు చేరవేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 60 రేషన్ షాపులను.. ఎంపిక చేసింది. ఈ జన్ పోషణ్ కేంద్రాల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు సహా మొత్తం 3500 ఉత్పత్తులను తక్కువ ధరకే రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. దీని వల్ల ప్రజలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను అందించడమే కాకుండా.. ఎక్కువ ఉత్పత్తులను విక్రయించినందుకు రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్ కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోని 4 రాష్ట్రాల్లో ఉన్న 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జన్ పోషణ్ కేంద్రాల పైలట్ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషి మరిన్ని వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న రేషన్ షాప్‌ల పరిస్ధితుల గురించి కేంద్రమంత్రి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు.. నెలకు కేవలం 8 నుంచి 9 రోజులు మాత్రమే తెరుస్తున్నారని.. మరికొన్ని అయితే 3 నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో ఆ రేషన్ దుకాణాలను మూసివేసి ఉంటున్నాయని తెలిపారు. దీంతో రేషన్ డీలర్లకు ప్రస్తుతం వస్తున్న కమీషన్లు సరిపోవట్లేదని.. అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మేరా రేషన్ యాప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పరిచయం చేశారు.
ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రేషన్ షాప్‌లను పూర్తిగా ఆధునీకరించనున్నారు. ఈ జన్ పోషణ్ కేంద్రాల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యవసర సరుకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలో 3500 ఉత్పత్తులను ఈ జన్ పోషణ్ కేంద్రాల్లో విక్రయించనున్నారు. దీంతో విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా రేషన్ డీలర్లకు కూడా అదనపు ఆదాయాలు వస్తాయని కేంద్రం యోచిస్తోంది. దేశీయంగా దాదాపు 5.38 లక్షల ఎఫ్‌పీఎస్‌లు ఉన్నాయి.