అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎసెన్షియా ఫాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆ పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానుల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్ చేయడం మీద దృష్టి పెడతాం. సేఫ్టీ ఆడిట్ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతాను. ఇప్పటికే హిందూస్తాన్ షిపింగ్ యార్డు వారితో ఒకసారి మాట్లాడాను. మీరు తీసుకుంటున్న రక్షణ చర్యలు చెప్పాలని కోరితే, వారు బాగానే తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కానీ పూర్తి భద్రత ఇవ్వాలనేది ప్రాథమిక బాధ్యత. సేఫ్టీ ఆడిట్ ను కఠినంగా అమలు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని చెబుతున్నారు. అయితే పరిశ్రమలు కచ్చితంగా అక్కడి పనిచేసే వారికి కనీస రక్షణ పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమల్లో రక్షణ అంశం మీద నేనే ప్రత్యేకంగా దృష్టి పెడతాను. ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యేకంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. దీన్ని అరికట్టడంపై దృష్టి పెడతాం. పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా, ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’’ అన్నారు.