చిత్తూరు అపోలో యూనివర్సిటీలో బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొందరికి అపోలో కళాశాలలో, మరికొందరికి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు నగర శివారు మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీలో 1,200 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొంతమందికి జ్వరం, కడుపునొప్పి వచ్చింది. వాంతులు, విరేచనాలు అయ్యాయి. కళ్లు తిరిగాయి. అప్రమత్తమైన అపోలో యాజమాన్యం కళాశాలలోని మెడికల్ సెంటర్ నుంచి డాక్టర్లను రప్పించి వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న 90 మందికి పైగా విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.అపోలో కళాశాలను చిత్తూరు డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి పరిశీలించారు. హాస్టల్, కిచెన్, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. డీన్, విద్యార్థులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. నీటి, భోజన శ్యాంపిల్స్‌ను తీసుకున్నారు. రిపోర్టు వచ్చే వరకు ఇక్కడి నీరు, భోజనం తీసుకోవద్దని డీఎంహెచ్‌వో ఆదేశించారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్‌తో కలిసి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని, రెఫర్ చేయకుండా ఇక్కడే వైద్యం చేయాలని ఆదేశించారు.ఫుడ్ పాయిజన్‌కు గురై చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరామర్శించారు. ఘనటపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.