అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వడ్లపూడిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విశాఖపట్టణం జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి శెట్టిబలిజవీధికి చెందిన గెద్దాడ శ్రీనివాసరావు (40) డాక్‌యార్డులో పనిచేస్తుంటాడు. ఇతడికి భార్య దేవి (36), పిల్లలు లోకేష్, మహి ఉన్నారు. దొండపర్తిలోని తనఅన్నయ్య గణేష్‌కు రాఖీ కట్టడానికి దేవి భర్త పిల్లలతో కలిసి ఈనెల 19న వెళ్లింది. లోకేష్‌కు జ్వరంగా ఉందని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని సూచించి పిల్లలను అతని వద్ద ఉంచి బుధవారం మధ్యాహ్నం భర్తతో కలిసి ఇంటికి చేరింది. అలా చేరిన వెంటనే దంపతులు ఇంట్లోని రెండు సీలింగ్ ఫ్యాన్‌లకు ఉరి వేసుకున్నారు. అయితే లోకేష్ వద్ద తల్లి సెల్‌ఫోన్ ఉండడంతో సాయంత్రం తండ్రికి ఫోన్ చేశాడు. తీయకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి, అమ్మా నాన్న ఫోన్ లిఫ్ట్ తీయడం లేదని, కనుక్కోవాలని కోరాడు. ఇంటికి వెళ్లిన బంధువులు తలుపుకొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా భార్యాభర్తలిద్దరూ ఫ్యాన్‌లకు వేలాడుతూ కనిపించారు. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి తలుపులు బద్దలుగొట్టి లోపలకు వెళ్లారు. దువ్వాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ త్రినాథ్, సీఐ ఎర్రంనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. అప్పుల బాధ తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని బంధువులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనతో వడ్లపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతదేహాల వద్ద రెండు పేపర్లు పోలీసులకు లభించాయి. అందులో గణేష్ అన్నయ్య, అమ్మా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ బొమ్మలు వారికే కొన్నాము. ఐ మిస్‌యూ... నన్ను క్షమించండి అన్నయ్యా...ఇట్లు దేవి అని మాత్రమే రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు కారణాలేమిటనేది అందులో పేర్కొనలేదు.