అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో 15 మంది మరణించగా.. ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదని గుర్తు చేశారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన 17 మంది కుటుంబసభ్యులకు, 36 మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు అందజేశామని తెలిపారు.తెలిసి తెలియకుండా శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు వైఎస్ జగన్ వ్యవహరించడం బాధాకరమని వంగలపూడి అనిత మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేసి ప్రమాద బాధితులకు న్యాయం చేశారని తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని.. లేదంటే తానే స్వయంగా ధర్నా చేస్తానని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కూడా అనిత మండిపడ్డారు. బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన వారిపై ధర్నా చేయాలని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రూ.150 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.కాగా అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడి గాజువాక పవన్ సాయి, విశాఖ మెడికవర్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి అనిత శుక్రవారం పరామర్శించారు. బాధితుల బ్యాంక్ ఖాతాలో పరిహారం డబ్బులు జమ చేసినట్లుగా కన్ఫర్మేషన్ ఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.