పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ తన ఫేవరేట్ క్రికెటర్ల గురించి పేర్కొంది. వాళ్లతో కాసేపు ముచ్చటించినా తనకి ఎంతో బాగుంటుందని పేర్కొంది.ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్స్‌లో కంచు మోత మోగించింది.కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మను భాకర్ తనకి ఇష్టమైన క్రీడాకారుల గురించి మాట్లాడింది. జమైకా స్టార్ రన్నర్ ఉసేన్ బోల్త్ తన ఫేవరేట్ అథ్లెట్ అని తెలిపింది. అలాగే భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయాలు లిఖించిన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి తన ఫేవరేట్ ప్లేయర్లు అని పేర్కొంది. వాళ్లతో మాట్లాడుతూ సమయం గడిపితే ఎంతో బాగుంటుదని తెలిపింది.
''నాకు ఇష్టమైన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. నా ఫేవరేట్ అథ్లెట్ జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్. ఆయన జీవితచరిత్ర పుస్తకం చదివాను. ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణగా ఉంటుంది. అంతేగాక బోల్ట్ ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను. ఇక భారత క్రికెట్ విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి.. నా ముగ్గురు ఫేవరేట్ క్రికెటర్లు. వాళ్లతో కాసేపు మాట్లాడినా ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది'' అని మను భాకర్ పేర్కొంది.
ఇక వచ్చే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. దేశం కోసం ఓ అథ్లెట్‌గా తన వంతు పాత్ర పోషించాలని భావిస్తానని తెలిపింది. ఒలింపిక్స్‌తో సహా ఇతర ప్రధాన ఈవెంట్లతో భారత్ పతకాల మోత మోగించాలని, దాని కోసం కృషి చేస్తానని తెలిపింది. అలాగే జూనియర్లకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటానని పేర్కొంది.