నర్సీపట్నం స్థానిక మరిడి మహాలక్ష్మి అమ్మవారికి జాతర సమయంలో అలంకరించి ట్రెజరీలో భద్రపరిచిన బంగారు హారం తాజాగా చేపట్టిన నగల నాణ్యత నిర్ధారణలో గిల్ట్ ఆభరణంగా మారిపోయినట్టు దేవదాయ శాఖ అధికారులు గుర్తించారు. ఇది ఎలా జరిగిందో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. దీనిపై దేవదాయ శాఖ జిల్లా అధికారిణి సుధారాణి ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మరిడిమహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్వహణ, పండగ ఏర్పాట్లు పూర్వ కాలం నుంచి అయ్యన్నపాత్రుడు కుటుంబీకులు చూసుకునేవారు. మూడేళ్లకు ఒకసారి జరిగే పండగ సమయంలో అమ్మవారికి ఆభరణాలు అలంకరించి తర్వాత వారి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంచేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 ఆగస్టు 2న ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఆ ఏడాది పండగ సమయంలో అమ్మవారికి ఆభరణాలు అలంకరించలేదు. 2023 ఏప్రిల్ 19వ తేదీన 510 గ్రాముల బంగారం ఆభరణాలు, ఐదున్నర కిలోల వెండి వస్తువులను మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు దేవదాయ శాఖ అధికారులకు అప్పగించారు. దేవదాయ శాఖ నగల వెరిఫికేషన్ అధికారి, ఎప్రైజర్ (బంగారం నాణ్యత నిర్ధారణ ఉద్యోగి) నగలు పరిశీలించి అవన్నీ బంగారం ఆభరణాలుగా నిర్ధారించారు. అధికారికంగా రికార్డులలో నమోదు చేసి ఈవో గంగారావు, జేవీవో, ఎప్రైజర్ సంతకాలు చేశారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలు దేవదాయశాఖ స్వాధీనం చేసుకునేటప్పుడు జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో జరగాలి. అయితే ఆభరణాల స్వాధీనం తంతు ఈవో సమక్షంలో నడిపించడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. అమ్మవారి జాతర సందర్భంగా ఏప్రిల్ 21న అమ్మవారికి అలంకరించడానికి అర్చకులకు నగలు అందజేశారు. పండగ ముగిసిన తరువాత మే 2న దేవదాయ శాఖ అధికారులు అర్చకుల నుంచి నగలు తీసుకు వెళ్లారు. బ్యాంకు లాకరులో పెట్టడానికి అవకాశం లేకపోవడంతో బాక్సులో పెట్టి సీల్ చేసి ట్రెజరీలో భద్రపరిచారు. కాగా... రెండేళ్ల క్రితం దేవదాయశాఖ పరిధిలోకి తీసుకున్న మరిడితల్లి ఆలయ నిర్వహణ బాధ్యతలు తిరిగి మూడు రోజుల క్రితం ఆలయ ధర్మకర్త, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి తిరిగి అప్పగించారు. అమ్మవారి ఆభరణాలు అప్పగించే ప్రయత్నం చేయగా బంగారం నగలు నాణ్యత నిర్ధారణ చేయించారు. ఆభరణాలలో 390 గ్రాముల బరువు ఉన్న హారం గిల్ట్ నగ అని తేలింది. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నగలు స్వాధీనం చేసుకోలేదు. ఈ నెల 22 తేదీన జిల్లా అధికారి సుధారాణి నర్సీపట్నం దేవదాయశాఖ కార్యాలయంలో జేవీవో, ఎప్రైజర్‌ను పిలిపించి మరోసారి నగలు తనిఖీ చేయించారు. హారం గిల్ట్ అని తేలడంతో దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా దేవదాయ శాఖ అధికారిణి సుధారాణి వివరణ కోరగా గిల్ట్ నగ విషయంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.