పాడేరు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఓ స్టాఫ్‌నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాడేరులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఆరు నెలలుగా తమకు జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకే ఆత్మాహత్యాయత్నం చేసినట్టు ఆమె తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... స్థానిక ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్న షేక్ మీరా భాను శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే నొప్పులకు సంబంధించిన 40 మాత్రలను మింగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు వాంతులు, విరేచనాలు కావడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయంతో శనివారం ఉదయం స్థానిక ఆస్పత్రిలో చేరింది. వైద్యులు, సిబ్బంది ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. తన భర్త కొవిడ్‌తో మృతి చెందారని, తన జీతంలోనే ఇద్దరు పిల్లలను పోషిస్తున్నానని, ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డానని స్టాఫ్‌నర్సు మీరా భాను తెలిపారు. జీతాలు అందక అవస్థలు పడుతున్నామని, ఈ క్రమంలో బతకడం కంటే చావడమే మేలనే భావనతోనే ఈ ఘటనకు పాల్పడ్డానన్నారు. ప్రభుత్వం తమకు జీతాలు అందించి ఆదుకోవాలని ఆమె కోరారని తోటి సిబ్బంది విలేకరులకు తెలిపారు.