కొవ్వూరు మండలం దేచర్ల గ్రామంలో లారీ ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి చెందింది. రాజమహేంద్రవరం కంబాలచెరువు ప్రాంతానికి చెందిన బడుగు రాజారత్నం(47) దేవరపల్లి మండలం గౌరీపట్నం హైస్కూల్లో హిందీ టీచర్ గా పనిచేస్తున్నారు. కుమార్తె నిషితకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో 5 రోజులు మెడికల్ లీవు పెట్టడానికి పాఠశాలకు రాజమహేంద్రవరం నుంచి బస్సులో వచ్చారు. పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి పాఠశాలలో పనిచేస్తున్న లెక్కల మాష్టారు కదిరి మురళీకృష్ణప్రసాద్‌ను గౌరీపట్నం సెంటరులో బైక్‌పై డ్రాప్ చేయాలని కోరారు. గౌరీపట్నం సెంటర్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలుపుదల చేయకపోవడంతో పంగిడి సెంటర్‌లో డ్రాప్ చేయాలని కోరడంతో ఇద్దరూ బైక్‌పై బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు పక్కన మట్టి చేరడంతో దేచర్లలోని త్రివేణి ఫ్యాక్టరీ సమీపంలో బైక్ జారడంతో కిందపడిపోయారు. మురళీకృష్ణప్రసాద్ పైకిలేచి చూసేసరికి వెనుక వస్తున్న లారీ రాజారత్నం తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొవ్వూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త వి.రాజేంద్ర ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.శ్రీహరి కేసు నమోదు చేశారు.