ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలంలో ఆగస్ట్ 29వ తేదీన బంగారు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు .ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ఆగస్ట్ 29న స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైలం ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఇక నుంచి ప్రతి నెలలోనూ ఆరుద్ర నక్షత్రం రోజున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 29న ఉదయం ఏడున్నరకు తూర్పు రాజగోపురం నుంచి నంది మండపం వరకూ స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బంగారు స్వర్ణరథంపై కొలువై స్వామివార్లు భక్తులను కటాక్షించనున్నారు. మరోవైపు శ్రీశైలం దేవస్థానానికి స్వర్ణరథాన్ని గత ఫిబ్రవరి నెలలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విరాళంగా అందించారు. ఈ రథంపైనే ఉత్సవం జరగనుంది.
మరోవైపు శ్రీకృష్ణ జన్మాస్టమి సందర్బంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో గోపూజ నిర్వహించారు. శ్రీగోకులం, దేవస్థానం గోసంరక్షణశాలలోని గోవులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు పూజ సంకల్పం పఠించారు. ఆ తర్వాత శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం దేవస్థానానికి చెందిన గో సంరక్షణశాలలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఇతర అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
మరోవైపు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు. పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసం వంటివి రాకుండే ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆలయ ద్వారం వద్ద కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనాల పత్రాలతో పాటుగా మందు, మాంసం వంటి వాటితో శ్రీశైల ఆలయ పరిసరాల్లోకి రాకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు.