మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బద్రర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. మంగళవారం పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే తాను, బోండా ఉమా మాచర్లకి వెళ్ళామని తెలిపారు. తమపై పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో పాత్రధారి తురకా కిషోర్, సూత్రధారి పిన్నెల్లి అని చెప్పుకొచ్చారు. ‘‘మా కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేశారు. మాపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతం’’ అని చెప్పుకొచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అప్పటి సంఘటలను గుర్తుచేశారు. అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మమ్మల్ని చంపడానికి పిన్నెల్లి పధకం వేశారు. మాపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి’’ అని అన్నారు.