రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాద ఘటనలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. రాత్రి 12:30 గంటల వరకు వీఆర్ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అధికారులు విచారించారు. వీడియో రికార్డింగ్ మధ్య సీన్‌ను రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను విచారించారు. అగ్నిప్రమాద ఘటన సమయంలో ఎక్కడి నుంచి మంటలు వ్యాపించాయి, ఎంతవరకు ఫైళ్లు దహనమయ్యాయి అనే కోణంలో ఫైర్ అధికారులను కూడా సీఐడీ అధికారులు విచారించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సబ్ కలెక్టరేట్‌లోనే సీఐడీ అధికారులు తిష్ట వేసి మరీ విచారణను చేపట్టారు. కాగా.. అగ్నిప్రమాదంలో ఫైళ్ల దగ్ధం అయిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా నిజనిజాలు బయటపెట్టాలనే ఉద్దేశంతోకేసును ఈనెల 8న పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రాత్రి అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ డీఎస్పీ వేణగోపాల్ ఆధ్వర్యంలో విచారణను మొదలుపెట్టారు. జూలై 21న రాత్రి సమయంలో మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాయలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22-ఏ సెక్షన్లో కీలకమైన పైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వైసీపీ నేతల అక్రమాలు బయటకురాకుండా ఇలాంటి చర్యలు పాల్పిడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అగ్రహారం వీఆర్ఏ.. ఆర్డీఏకు సమాచారం అందజేశాడు. ఆర్డీఏ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో పరిగణించింది.