రెవిన్యూ, రిజిస్ట్రేషన్ ఫారెస్టు, ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ మోసగాల్లు రికార్డులు తారుమారు చేసి వేల కోట్లు సంపాదించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... చివరికు దేవుని మాన్యం భూములు, వక్స్ బోర్డు భూములను కూడా కబ్జా చేశారన్నారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి శిష్యుడు బత్తుల మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ కబ్జాలపై విచారణ మొదలైందన్నారు. కర్నూలు జగన్నాథ గట్టుపై 79 ఎకరాలు కొట్టేసిన పొలాలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి జరిగే రెవిన్యూ సదస్సుల్లో బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తవ్వేకొద్ది వైసీపీ భూ కబ్జా నిర్వాకాలు బయటికొస్తున్నాయన్నారు. దీపారాధన జరగాలని మన పూర్వీకులు దేవాలయాలకు భూములు ఇచ్చారని.. వాటిని కూడా రియల్ మోసగాల్లు రికార్డులు తారుమారు చేసి కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరులోని ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయం భూములు కబ్జా చేసి వెంచర్ల కోసం రోడ్లు వేశారన్నారు.