తిరుపతిలో గంజాయిని దాచి విక్రయిస్తున్న ఇద్దరిని అలిపిరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారినుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వచ్చే 100 రోజుల్లో తిరుపతి జిల్లాను డ్రగ్ రహితంగా మార్చాలనే సంకల్పంతో గంజాయి, మాదక ద్రవ్యాల సేవనం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటివి అరికట్టడానికి ఎస్పీ సుబ్బరాయుడు ఓ టాస్క్‌ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో అలిపిరి సీఐ రాంకిషోర్ సిబ్బందితో కలసి కపిలతీర్థం రోడ్డు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పద స్థితిలో కన్పించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారి వద్ద గంజాయి బయటపడింది. చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెకు చెందిన పట్టాభి గుణశేఖర్, ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలోని మన్నసముద్రం గ్రామానికి చెందిన కొండా మునిభరణిగా వారిని గుర్తించారు.గుణశేఖర్ బ్యాగులో 12 కిలోల గంజాయిని ,మునిభరణి బ్యాగులో 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.యశోదానగర్‌లోని గుణశేఖర్ రూములో గంజాయిని నిల్వ చేసి చిన్న చిన్న పొట్లాలు కట్టి అవసరమైన వారు ఫోన్ ద్వారా సంప్రదిస్తే తీసుకెళ్ళి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ వెంకటనారాయణ చెప్పారు.మునిభరణిపై గతంలో కూడా మూడు గంజాయి కేసులున్నట్లు చెప్పారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ రాంకిషోర్, సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. తిరుపతిలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా...వినియోగిస్తున్నా...గోడౌన్లలో స్టాకు పెట్టినట్లు తెలిసినా పోలీసు వాట్సాప్ నెంబరు 8099999977కు సమాచారం ఇవ్వాలని సూచించారు.