కొన్ని నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఓ వైపు పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అల్లు అర్జున్ అదే పార్టీకి సపోర్ట్‌గా ప్రచారం చేయడం ఏంటని అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసేన నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే తన స్నేహితుడు అని మాత్రమే తాను ప్రచారానికి వెళ్లినట్లు అల్లు అర్జున్ చెప్పినప్పటికీ మెగా అభిమానులు, జనసైనికులు శాంతించడం లేదు. ఈ వివాదం కాస్తా.. చిలికి చిలికి గాలివానలాగా తయారైంది. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ నుంచి జనసేన నేతల నుంచి మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జ్ చలమల శెట్టి రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్ అంటూ చలమల శెట్టి రమేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి అంటే మహావృక్షం లాంటివాడని.. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడని కొనియాడారు.
అలాంటి చిరంజీవని అవమానించావని అల్లు అర్జున్‌పై చలమల శెట్టి రమేష్ బాబు విరుచుకుపడ్డారు. నీడను ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావని.. నువ్వు, మీ నాన్న అల్లు అరవింద్ కనీసం పిల్లికి కూడా బిక్షం వెయ్యరని మండిపడ్డారు. చిరంజీవి, పవన్, కళ్యాణ్ నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదలయ్యే సినిమా తమ నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూపిస్తా అంటూ హెచ్చరికలు చేశారు. కనీసం అల్లు అర్జున్ ఫ్లెక్సీలు కట్టేవాళ్లు కూడా ఇక్కడ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.
మరోవైపు.. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అల్లు అర్జున్‌కు, తమ పార్టీ జనసేనకు ఎలాంటి శత్రుత్వం లేదని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మొన్న అతను తమను ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టే తాను మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ మళ్లీ ఏదైనా మాట్లాడితే దానికి తాను కౌంటర్ ఇస్తానని స్పష్టం చేశారు.