ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉండటంతో.. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు జగన్ విదేశీ పర్యటన కొనసాగనుంది.. జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్‌పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు నుంచి అనుమతి వచ్చింది. కొత్త పాస్‌పోర్టు కోసం జగన్ దరఖాస్తు చేస్తే.. ఐదేళ్ల కాల పరిమితితో కొత్త పాస్ పోర్టు ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది. జగన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చారు. మే 17 నుంచి జూన్1 వరకు విదేశాల్లో ఉన్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పర్యటనలు తరచుగా బెంగుళూరు వెళ్లి వస్తున్నారు.
మరోవైపు ఆస్తుల కేసులో A2 నిందితుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటన కోసం అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. అయితే విజయ సాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేయగా.. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఆస్తుల కేసులో జగన్ నిందితుడిగా ఉన్నారు.. ఆయన ఎప్పుడు దేశం విడిచి వెళ్లాలన్నా తప్పనిసరిగా సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ ఏడాది మేలో ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. అనుమతి వచ్చిన తర్వాతే వెళ్లారు. ఆస్తుల కేసులో నిందితుడిగా ఉండటంతో.. ముందస్తు సమాచారం, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అందుకే జగన్ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.