ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. పశువులకు సంబంధించి పశు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చి అమలుకు నిర్ణయించింది.. అంతేకాదు రాయితీ సొమ్మును కూడా కేటాయించింది. ఈ పథకం కింద ప్రభుత్వం నాటు పశువులకు రూ.15 వేలు, మేలు జాతి పశువులకు రూ.30 వేలకు బీమా చేస్తుంది. ఒకవేళ రైతులు ఎవరైనా పాడి పశువులకు రూ.30 వేల కంటే ఎక్కువకు బీమా చేసుకోవాలని భావిస్తే అదనంగా అయ్యే సొమ్మును వారు చెల్లించే వెసులుబాటు కూడా ఉంది.
ప్రభుత్వం మూడేళ్ల కాల వ్యవధికి బీమా ప్రీమియం చెల్లించడానికి రాయితీ అందిస్తోంది. అంతేకాదు పాడి పశువులతో పాటు, గొర్రెలు, మేకలు, పందులకు కూడా పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటికి మాత్రం రూ.6 వేలు పరిహారంగా చెల్లిస్తారు. అయితే తొలిదశలో జిల్లాలకు కేటాయించిన రాయితీ సొమ్ము బీమా ప్రీమియం చెల్లించడానికి ఖర్చు చేస్తే. అదనంగా మళ్లీ సొమ్ము విడుదలకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ బీమా పథకంపై జిల్లాల్లో పాడి రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తెలియజేసి బీమా చేయిస్తున్నారు. పశు బీమా పథకం కింద మేలు జాతి పాడిపశువులు ఒక్కొక్కటి రూ.లక్ష వరకు విలువ చేస్తుంది.. పోషకులందరూ బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతులు పశు బీమా చేయించేటప్పుడు బ్యాంక్ పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఎస్సీ, ఎస్టీలైతే తెల్లరేషన్ కార్డు అందించాలని సూచిస్తున్నారు. పాడి పశువులకు బీమా చేసే క్రమంలో ట్యాగ్ (చెవికి పోగు) వేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అవి ఆ ట్యాగ్ పడిపోతే సమీపంలోని పశు సంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి తిరిగి వేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకవేళ పశువు మరణిస్తే.. వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బీమా సర్వేయర్ వచ్చే వరకు పశువుకు ఉన్న ట్యాగ్ తీయకూడదు. రైతులు ఒకవేళ బీమా చేయించిన పశువును విక్రయిస్తే.. ఏడు రోజుల్లోపు బీమా కంపెనీకి సమాచారమిచ్చి కొనుగోలుదారుని పేరుపై మార్చాల్సి ఉంటుంది.